ధాన్యం కొనుగోళ్లు.. రైతులను మోసం చేస్త్, లైసెన్స్‌లు రద్దు చేస్తాం : మిల్లర్లకు రేవంత్ వార్నింగ్



రైతుల నుంచి ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. 

మిల్లర్లు అక్రమాలకు పాల్పడినట్లు తేలితే కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులను రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ధాన్యంలో తేమ ఎక్కువగా వుందని వ్యాపారులు ధరలో కోతలు విధిస్తున్నారని ఈ సమస్యను ఎదుర్కొనేందుకు గాను మార్కెట్‌ యార్డుల్లో తగిన ఏర్పాట్లు చేయాలని రేవంత్ సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ధాన్యం చోరీ కాకుండా చర్యలు తీసుకోవాలని.. మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లు పరిశీలించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని .. కనీస మద్ధతు ధర అమలయ్యేలా చూడాలని సీఎం సూచించారు. 

Also Read : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు : ఇరాన్, ఇజ్రాయెల్‌లకు వెళ్లొద్దు.. భారతీయులకు కేంద్రం వార్నింగ్

మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిపై జరుగుతున్న ప్రచారంపై రేవంత్ రెడ్డి సర్కార్ స్పందించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఈ అంశంపై ప్రభుత్వ స్థాయిలో ప్రతిపాదన కానీ, ఫైల్ నిర్వహణ లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగుల వయోపరిమితిపై వివిధ వార్తాపత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 


 

Comments