పార్టీ మార్పు వార్తలపై గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందన .. కుమారుడి పోటీపైనా కీలక వ్యాఖ్యలు
తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు బీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లడుతూ.. తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో వున్నట్లుగా తెలిపారు. వరుసగా పదేళ్లు అధికారంలో వున్న బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం కష్టాల్లో పడిందన్నారు. పార్టీలో నిర్మాణ లోపం, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించడం, ఎమ్మెల్యే కేంద్రంగా రాజకీయాలు నడవటం వంటి వల్లే బీఆర్ఎస్ కష్టాల్లో పడిందని గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
తన కుమారుడు అమిత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇవ్వలేదనేది అవాస్తవమని.. ఆయనను ఎంపీగా పోటీ చేయించాలని స్వయంగా కేసీఆరే కోరారని సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అమిత్ కూడా అందుకు సరేనని అన్నారని.. కానీ జిల్లాకు చెందిన కొందరు నాయకుల సహకారం అందలేదని అందుకే అమిత్ పోటీ నుంచి వైదొలిగారని శాసనమండలి ఛైర్మన్ చెప్పారు. ఈ క్రమంలోనే కొందరు నేతలు తాము పార్టీ మారుతున్నామని చెబుతున్నారని సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం : చమురు ధరలు పైపైకేనా, భారత్‌పై ప్రభావం ఎంత..?
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ను కలిసేందుకు పలుమార్లు ప్రయత్నించానని.. దాదాపు ఆరు నెలలుగా కేసీఆర్‌ను కలవడం సాధ్యం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచైనా పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ అధినాయకత్వానికి సుఖేందర్ రెడ్డి సూచించారు.
Comments
Post a Comment