పదవి కోసం నా కాళ్లు పట్టుకోలేదా.. ప్రమాణానికి సిద్ధమా : పెద్దిరెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి సవాల్
వైసీపీ అగ్రనేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. నాడు సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని కిరణ్ ముఖ్యమంత్రి అయ్యారని ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై మాజీ సీఎం స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తాను ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టనని, పీసీసీ పదవి కోసం పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాత్రి నా కాళ్లు పట్టుకుని, ఉదయం మళ్లీ వచ్చి అదే విషయంపై కాళ్లావేళ్లా పడ్డారని కిరణ్ వ్యాఖ్యానించారు.
Also Read : దూసుకెళ్తోన్న " వందే భారత్ ఎక్స్‌ప్రెస్ " .. ఏకంగా 2 కోట్ల మంది ప్రయాణం ..!!
ఈ విషయంపై తాను ప్రమాణం చేసేందుకు సిద్ధమని.. మరి పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకోలేదని ప్రమాణం చేస్తారా అంటూ కిరణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. అన్నమయ్య జిల్లా పీలేరు టీడీపీ అభ్యర్ధిగా కిరణ్ సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కిరణ్ కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
కుటుంబ పాలన నుంచి ఇసుక మాఫియా వరకు పెద్దిరెడ్డి కుటుంబం అన్నీ చేసిందని ఆరోపించారు. పీసీసీ పదవి విషయంలో సహకరించలేదని తనపై కక్ష పెంచుకున్నారని కిరణ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తాను చేసిన అభివృద్ధి తప్పించి పీలేరులో ఆయన చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిద్ధమయ్యారని కిరణ్ ఆరోపించారు.
Also Read : రంజాన్ నెలలో బిర్యానీయే రారాజు.. ఏకంగా 60 లక్షల ఆర్డర్లు, హైదరాబాదే టాప్
ఇదిలావుండగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నుంచి ప్రత్యక్ష ఎన్నికలకు, రాజకీయాలకు దూరంగా వున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. మధ్యలో కాంగ్రెస్ గూటికి చేరుకున్నా మరోసారి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. టీడీపీ, జనసేనల మద్ధతుతో బీజేపీ అభ్యర్ధిగా రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆయన ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగడం చర్చనీయాంశమైంది.
రాజంపేట నుంచి తన చిరకాల ప్రత్యర్ధి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డితో తలపడుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి మిథున్ రెడ్డి 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. కుమారుడి విజయం కోసం పెద్దిరెడ్డి అన్ని రకాల అస్త్రశస్త్రాలను సిద్ధం చేశారు. సీఎం జగన్ ఆశీస్సులతో పాటు తన వ్యూహాలతో మిథున్ రెడ్డికి హ్యాట్రిక్ విజయం అందించాలని రామచంద్రారెడ్డి పట్టుదలతో వున్నారు. అయితే తన కుటుంబానికి వున్న బ్రాండ్ ఇమేజ్‌తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీల మద్ధతుతో తాను విజయం సాధిస్తానని కిరణ్ కుమార్ రెడ్డి ధీమాగా వున్నారు.
Comments
Post a Comment