దూసుకెళ్తోన్న " వందే భారత్‌‌ ఎక్స్‌ప్రెస్ " .. ఏకంగా 2 కోట్ల మంది ప్రయాణం ..!!

 


సుఖవంతమైన వేగవంతమైన ప్రయాణాన్ని దేశ ప్రజలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘‘వందే భారత్ ’’ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణీకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రారంభించిన ప్రతిచోట అద్భుతమైన ఆక్యూపెన్సీతో ఈ రైళ్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో వందే భారత్ స్లిపర్ కోచ్‌లను కూడా ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది. 

కాగా.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయాణించిన వారి గణాంకాలను రైల్వే శాఖ వెల్లడించింది. 2019 ఫిబ్రవరి 15న ఢిల్లీ - వారణాసి మధ్య తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీయగా.. ఈ ఏడాది మార్చి 31 వరకు ఈ రైళ్లలో దాదాపు రెండు కోట్ల మంది రాకపోకలు సాగించినట్లు రైల్వే శాఖ తెలిపింది. ముఖ్యంగా యువత వందే భారత్‌లో ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లుగా పేర్కొన్నారు. 

Also Read : బెంగళూరు సతమతం , మహారాష్ట్రకు పాకిన నీటి సంక్షోభం .. వాడకంపై పూణే కార్పోరేషన్ ఆంక్షలు

భారతదేశంలో తొలి రైలు (ముంబై - థానే మధ్య ) పరుగులు పెట్టి 171 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రైల్వేశాఖ ఈ వివరాలు విడుదల చేశారు. దేశంలోని 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 284 జిల్లాల మీదుగా 100 రూట్లలో ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఈ రైల్లు ప్రయాణించిన దూరం.. భూమిని 310 సార్లు చుట్టిరావడంతో సమానమని.. త్వరలో ‘వందే భారత్ స్లీపర్ రైళ్లు ’ ప్రయాణీకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తాయని రైల్వే శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. 

Also Read : ప్రపంచంలోనే అత్యంత రద్దీగా వుండే విమానాశ్రయాలు .. టాప్ 10లో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్, ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే..?

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖపట్నం, కాచిగూడ-యశ్వంత్‌పూర్ మార్గాల్లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ సేవలందిస్తోంది. త్వరలో తెలుగు రాష్ట్రాలకు మరికొన్ని రైళ్లను కేటాయించే అవకాశాలున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 


Comments