టార్గెట్ 400 : నరేంద్ర మోడీ ఛేదించగలరా ..?

 


వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు ప్రధాని నరేంద్ర మోడీ. 2014, 2019లలో ఎన్డీయే కూటమిలోని ఏ పార్టీ మద్ధతు లేకుండానే సొంతంగా ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి కావాల్సిన సీట్లు సంపాదించింది బీజేపీ. ఈసారి మోడీ 400 సీట్లలో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీకి 370 , ఎన్డీయే కూటమిలోని ఇతర పార్టీలకు మరో 30 సీట్లు మొత్తం కలిపి 400 సీట్లు కైవసం చేసుకోవాలని ప్రధాని భావిస్తున్నారు. వరుసగా రెండు సార్లు అధికారంలో వుండటంతో సహజంగానే వ్యతిరేకతతో పాటు పెట్రోలు, డీజిల్ , నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో మోడీ టార్గెట్ రీచ్ అవుతారా అనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. 

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ తొలి దశ పోలింగ్ జరిగింది. మోడీ ఛరిష్మా శిఖరాగ్రాన్ని చేరినప్పటికీ, పలు రాష్ట్రాల్లో బీజేపీకి పరిస్ధితులు అనుకూలంగా లేవని విశ్లేషకులు అంటున్నారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలను కలుపుకుని 193 లోక్‌సభ స్థానాలున్నాయి. ఈ రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతుందని చెబుతున్నారు. 

Also Read : ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం : చమురు ధరలు పైపైకేనా, భారత్‌పై ప్రభావం ఎంత..?

2014లో మోడీ విజయం 282 సీట్లతో స్వల్ప మెజారిటీతో వున్నప్పటికీ వారికి స్వీప్‌గా అనిపించింది. 2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాద దాడి.. దీనికి ప్రతిగా మోడీ ప్రభుత్వం నిర్వహించిన బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ ప్రజల్లో జాతీయవాదాన్ని తారాస్థాయికి తీసుకెళ్లింది. తద్వారా 2014 కంటే ఎక్కువ ఓట్లను, సీట్లను బీజేపీ పొందగలిగిందనేది అందరూ అంగీకరించే మాట. 

బీహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, అస్సాం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ బలంగా వుంది. బెంగాల్, ఒడిషాలలోనూ కాషాయం పుంజుకున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఆరు కీలక రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో 2019 ఎన్నికల్లో మోడీకి మంచి ఫలితాలే వచ్చాయి. 

Also Read : రంజాన్‌ నెలలో బిర్యానీయే రారాజు.. ఏకంగా 60 లక్షల ఆర్డర్లు, హైదరాబాదే టాప్

కానీ ఇప్పుడు ఇక్కడ రాజకీయంగా బీజేపీకి కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెంగాల్, ఒడిశాలలోనూ దాదాపు ఇదేరకమైన పరిస్థితులతో బీజేపీ పోరాడాల్సి వుంది. ఇక తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలలోని దాదాపు 100 సీట్లు బీజేపీకి ఆమడ దూరంలో వున్నాయి. 2014లో సాధించిన 303 సీట్ల సంఖ్యను దాటడానికి ఈ ఆరు రాష్ట్రాల నుంచి 100కు మించి ఎంపీలు గెలవడం అవసరం. జార్ఖండ్ , కర్ణాటకలలో బీజేపీ ప్రత్యర్ధులు అధికారంలో వున్నారు. 

హిందీ బెల్ట్‌లో బీజేపీకి ఎదురులేనప్పటికీ తూర్పు, దక్షిణ భారతదేశం బీజేపీకి కొరకరాని కొయ్యగానే మారింది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. అయోధ్య రామమందిరాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేసి కోట్లాది మంది హిందూ ఓటర్ల మనసుల్ని గెలుచుకున్నారు మోడీ. ఇటీవల ఒకేసారి ఐదుగురికి భారతరత్న అవార్డులను ప్రకటించి వ్యూహాత్మకంగా పావులు కదిపారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్, బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ, దివంగత మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌‌లకు దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది మోడీ ప్రభుత్వం. 

Also Read : ఓటు ఫ్రమ్ హోమ్ : అర్హులెవరు, దరఖాస్తు ఎలా, ఓటు ఎలా వేయాలి..?

ఇది ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియాలతో పాటు ఆర్ధిక సంస్కరణలు, తీవ్రవాదంపై కఠిన వైఖరి, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ఖ్యాతి ఇనుమడించడం వంటివి మోడీ ఛరిష్మాను పెంచుతున్నాయి. ఇవన్నీ కలిసొస్తే ప్రధాని అనుకున్న 400 సీట్ల టార్గెట్ పెద్ద కష్టమేమీ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.  

Comments