వారణాసిలో విలక్షణ నటుడు.. ఆ ఆకలి తీరిందంటూ పోస్ట్ వైరల్
ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం వారణాసి. సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే కుంభగా పృథ్వీరాజ్.. మందాకినిగా ప్రియాంక చోప్రాల ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత రామోజీ ఫిలింసిటీలో జరిగిన గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌లో రుద్రగా మహేశ్ బాబు లుక్, గెటప్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. వీరు ముగ్గురు కాకుండా సినిమాలో నటించే ఇతర నటీనటుల ఎవరన్నది ఇంత వరకు బయటకు రాలేదు. రాజమౌళి కూడా అత్యంత గోప్యత పాటిస్తున్నారు. తాజాగా వారణాసిలోని నటిస్తోన్న మరో నటుడి వివరాలు బయటకు వచ్చాయి. స్వయంగా ఆ నటుడు ట్వీట్ చేశాడు.
శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ పతాకాలపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తీకేయ, ఎస్ గోపాల్ రెడ్డిలు ఈ సినిమాను దాదాపు 1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వీ విజయేంద్రప్రసాద్, ఎస్ఎస్ కాంచీలు వారణాసి సినిమాకు కథను అందిస్తుండగా.. దేవ కట్టా డైలాగ్స్ రాశారు. పీఎస్ వినోద్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. వీ శ్రీనివాస్ మోహన్ ఈ వారణాసి సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ నిర్వహణను చూస్తున్నారు. 2027 వేసవి కానుకగా వారణాసి చిత్రం విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషలలో వారణాసి చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
వారణాసి సినిమాను అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే రాజమౌళి తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తొలిసారిగా పూర్తి సినిమాను ఐ మ్యాక్స్ ఫార్మాట్‌లో తీస్తున్నారు. రామాయణ పార్ట్ 1 తర్వాత ఈ విధానంలో తెరకెక్కుతోన్న రెండవ భారతీయ చిత్రం వారణాసి కావడం గమనార్హం. అలాగే నాన్ ఇంగ్లీష్ సినిమా కేటగిరీలో 1:43:1 ఐ మ్యాక్స్ రేషియాలో తెరకెక్కుతున్న సినిమాగా రాజమౌళి - మహేశ్‌ల మూవీ నిలిచింది.
వారణాసి సినిమాలో పలువురు నటీనటులు భాగమైనట్లుగా గతంలో గాసిప్స్ వచ్చాయి.. ఇప్పటికీ ఇవి వస్తూనే ఉన్నాయి. కానీ అవన్నీ గాలివార్తలుగా మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో నటిస్తున్న నటుడు తాను రీసెంట్ షెడ్యూల్ పూర్తి చేసినట్లు స్వయంగా ట్వీట్ చేశారు. ఆ నటుడు ఎవరో కాదు.. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్. ఈ చిత్రం నాలోని నటుడి ఆకలి తీర్చింది. నాకు అవకాశం కల్పించిన రాజమౌళికి ధన్యవాదాలు. మహేశ్ బాబు, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాలతో కలిసి పనిచేయడం బాగుంది.. తదుపరి షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకాష్‌రాజ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.
ప్రస్తుతం ప్రకాశ్‌రాజ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆయన వారణాసి చిత్రంలో ఏ రోల్ పోషిస్తున్నారు. మహేశ్ తండ్రిగానా? హీరోయిన్ తండ్రిగానా? లేక మరేదైనా కీలకపాత్రా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే రాజమౌళి మంచి టైం చూసుకుని ప్రకాశ్‌రాజ్ తాలూకా లుక్, గెటప్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రకాశ్‌రాజ్ నటించడం ఇది రెండోసారి. గతంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన విక్రమార్కుడులో ప్రకాష్ రాజ్ నటించారు.


.jpg)


.jpg)
