ఏపీ రాజకీయాల్లో సంచలనం .. కూటమి అభ్యర్ధులను గెలిపించాలంటూ చిరంజీవి పిలుపు

 


తెలుగు చిత్ర సీమను నాలుగు దశాబ్ధాల పాటు మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని భావించిన ఆయన 2008లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 2009లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. 

అయితే దివంగత మహానటుడు నందమూరి తారక రామారావు తర్వాత అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలనుకున్న ఆయన కలలు కల్లలయ్యాయి. స్టార్ డమ్‌తో అందివచ్చిన హైప్‌ను కొనసాగించలేకపోయిన చిరు ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని మూటకట్టుకుని 18 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకున్నారు. పాలకొల్లు, తిరుపతిలలో పోటీ చేసిన మెగాస్టార్.. పాలకొల్లులో స్వయంగా ఓటమి పాలవ్వగా.. తిరుపతిలో గెలిచి పరువు దక్కించుకున్నారు. 

Also Read : మెగా ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ : పవన్‌కి బాసటగా చిరు, జనసేనకు రూ.5 కోట్ల విరాళం

ఎన్నికల తర్వాత పార్టీని నడపలేకపోయిన చిరంజీవి మూడేళ్లు నిండకుండానే 2011 ఆగస్టులో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన ఆయన మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. రాజ్యసభ పదవీ కాలం ముగిసిన తర్వాత రాజకీయాలను పూర్తిగా పక్కనపెట్టేసి తనకు ఎంతో ఇష్టమైన, తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన సినిమాల వైపు ఫేస్ టర్నింగ్ ఇచ్చారు. 

ప్రజారాజ్యం ఫెయిల్యూర్ తర్వాత చిరంజీవి రాజకీయాల వైపు కన్నెత్తి చూడలేదు. స్వయంగా తన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినప్పటికీ దానికి మద్ధతు పలకడం కానీ, విమర్శించడం కానీ చేయలేదు. నాటి పరిస్ధితులు వేరు, నేడు వేరు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. 

Also Read : యూఏఈ : దుబాయ్‌లో వరదలా , ‘‘ క్లౌడ్ సీడింగ్ ’’ అంత పని చేసిందా ..?

జనసేన అధినేత పవన్ .. టీడీపీ, బీజేపీలతో కలిసి ఉమ్మడిగా బరిలో దిగారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్ధుల తరపున ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా కాంపౌండ్ పవన్‌కు అండగా వుంటుందా , వుండదా అనే చర్చ జరుగుతోంది. మిగిలిన కుటుంబ సభ్యుల సంగతి ఎలా వున్నా.. పెద్దన్న చిరంజీవి స్టాండ్ ఏంటనేది మాత్రం ఉత్కంఠను కలిగించింది. మెగా అభిమానులతో పాటు కాపు సామాజికవర్గంలో చిరంజీవి మాటను వేదంలా ఫాలో అయ్యేవారు ఎందరో. 

ఇలాంటి వేళ.. కొద్దిరోజుల క్రితం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల్లో జనసేన విజయాన్ని ఆకాంక్షిస్తూ చిరంజీవి రూ.5 కోట్ల విరాళం అందించారు. హైదరాబాద్ శివార్లలో జరుగుతున్న ‘విశ్వంభర’ షూటింగ్ లోకేషన్‌కు పవన్ కళ్యాణ్, నాగబాబులు వెళ్లి చిరుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్‌కు మెగాస్టార్ రూ.5 కోట్ల చెక్ అందజేసి ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన వివరాలను చిరంజీవి ఎక్స్ ద్వారా పంచుకున్నారు. 

Also Read : రంజాన్‌ నెలలో బిర్యానీయే రారాజు.. ఏకంగా 60 లక్షల ఆర్డర్లు, హైదరాబాదే టాప్

" అందరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు.అధికారం లేకపోయినా, తన సంపాదన ని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం.తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేన కి విరాళాన్ని అందించాను." అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం చిరంజీవితో పవన్ కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

పవన్ విషయంలో చిరంజీవి వైఖరి మారిందనే ఊహాగానాలు ఈ సంఘటనతో మరింత బలం పొందాయి. ఈసారి ఏకంగా కూటమి అభ్యర్ధులకు మెగాస్టార్ మద్ధతు పలికారు. అనకాపల్లి లోక్‌సభ స్థానం కూటమి అభ్యర్ధిగా బరిలో నిలిచిన సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ స్థానం కూటమి అభ్యర్ధి పంచకర్ల రమేశ్ బాబులు హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ.. సీఎం రమేశ్, పంచకర్ల రమేశ్‌లను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పవన్ కోసం చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని.. పవన్, చంద్రబాబు, బీజేపీలు కలిసి కూటమిగా ఏర్పడటం మంచి పరిణామంగా చిరు పేర్కొన్నారు. సీఎం రమేశ్, పంచకర్ల రమేశ్‌లు తనకు కావాల్సిన వారని.. ఇద్దరూ మంచివాళ్లు, సమర్ధులని నియోజకవర్గాల అభివృద్ధికి దోహదపడతారనే నమ్మకం తనకు వుందని చిరు పేర్కొన్నారు. 

Also Read : ఎన్నికలొస్తే తెగ వినిపిస్తుంది .. అసలేంటీ ‘‘ బీ-ఫారం ’’..?

పంచకర్ల రమేశ్ తన దీవెనలతోనే రాజకీయాల్లోకి వచ్చారని చిరంజీవి గుర్తుచేశారు. కేంద్రంలో సీఎం రమేశ్‌కి వున్న పరిచయాలు అనకాపల్లి లోక్‌సభ స్థానం అభివృద్ధికి ఉపయోగపడతాయని మెగాస్టార్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని.. ఇలాంటి వారికి ఓటు వేసి గెలిపించాలని చిరు కోరారు. అయితే చాలా రోజుల తర్వాత చిరంజీవి రాజకీయాల గురించి మాట్లాడటం, అది కూడా కూటమి అభ్యర్ధుల తరపున వత్తాసు తీసుకోవడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 


Comments